రూ.10 లక్షలకు ‘నీట్’ పేపర్ కొంటే.. 720కి 107 మార్కులొచ్చాయి!

  • నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం
  • రాజస్థాన్‌లోని సికార్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి అరెస్ట్
  • కొడుకు కోసం రూ. 10 లక్షలు పెట్టి పేపర్ కొనుగోలు చేసిన తండ్రి
  • అయినా ఫెయిల్.. పరారీలో కొడుకు
  • లీకేజీ నెట్‌వర్క్‌తో సంబంధమున్న 150 మంది విద్యార్థులపై సీబీఐ నిఘా
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 పేపర్ లీకేజీ కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును విచారిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రాజస్థాన్‌లోని సికార్ జిల్లాపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. తాజాగా ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. దినేశ్ బివాల్, అతని సోదరుడు మంగీలాల్ బివాల్, మంగీలాల్ పెద్ద కుమారుడు వికాస్‌ను అదుపులోకి తీసుకున్నారు.

నీట్ అసలు ప్రశ్నపత్రాన్ని పోలిన ఒక 'గెస్ పేపర్‌'ను నిందితులు సంపాదించి, కోచింగ్ సెంటర్లకు సరఫరా చేసినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. అక్కడి నుంచి ఈ పేపర్ పలువురు అభ్యర్థులకు చేరినట్లు దర్యాప్తులో తేలింది.

తండ్రి అడ్డదారి.. కొడుకు పేలవమైన ప్రతిభ
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దినేశ్ బివాల్ కుమారుడు రిషి బివాల్ కోసం సీబీఐ గాలిస్తోంది. తన కొడుకు రిషిని డాక్టర్‌ను చేయాలనే ఉద్దేశంతో దినేశ్ సుమారు రూ. 10 లక్షలు చెల్లించి లీకైన పేపర్‌ను సికార్‌లో కొనుగోలు చేసినట్లు విచారణలో అంగీకరించినట్టు సమాచారం. అయితే, పరీక్షకు ముందే పేపర్ చేతికి అందినప్పటికీ రిషి నీట్‌లో 720 మార్కులకు గాను కేవలం 107 మార్కులు మాత్రమే సాధించడం గమనార్హం. ప్రస్తుతం రిషి పరారీలో ఉన్నాడు.

దర్యాప్తులో రిషి అకడమిక్ రికార్డును పరిశీలించగా అతడు చదువులో చాలా వెనుకబడినట్లు తేలింది. 10వ తరగతిలో కేవలం 44 శాతం మార్కులు సాధించిన రిషి.. 12వ తరగతిలో గ్రేస్ మార్కులతో సెకండ్ డివిజన్‌లో (50.80%) పాసయ్యాడు. ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ థియరీ పరీక్షల్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. అయినప్పటికీ, అతడిని మెడికల్ ఎంట్రన్స్ పరీక్షకు సిద్ధం చేయడం కోసం కుటుంబం ఈ అడ్డదారిని ఎంచుకుంది.

సికార్ ఫ్లాట్ కేంద్రంగా కార్యకలాపాలు
ఈ లీకేజీ నెట్‌వర్క్ కార్యకలాపాలకు సికార్‌లోని ఒక ఫ్లాట్‌ను సమన్వయ కేంద్రంగా ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. నెట్‌వర్క్‌లోని కొంతమంది సభ్యులు కొరియర్లుగా వ్యవహరించి లీకైన పేపర్లను అభ్యర్థులకు నేరుగా చేరవేసినట్లు తేలింది. అరెస్ట్ అయిన దినేశ్, అతడి కుటుంబ సభ్యులు కూడా ఈ కొరియర్ పాత్ర పోషించినట్లు సీబీఐ అనుమానిస్తోంది. ఈ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో సుమారు 150 మంది విద్యార్థులను గుర్తించి, వారిపై సీబీఐ నిఘా పెట్టింది.  

NEET UG 2024
NEET paper leak
NEET scam
Dinesh Bival
Sikar Rajasthan
Rishi Bival
CBI investigation
Medical entrance exam

More Telugu News